The Odyssey | ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో రికార్డు స్థాయి ధరలతో ప్రారంభమయ్యింది. జూన్ 8న దేశవ్యాప్తంగా ఐమాక్స్ (IMAX) షోల కోసం బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఈ సినిమా టికెట్ల ధరలు చూసి సినీ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. ముంబై, పూణే వంటి మెట్రో నగరాల్లో ప్రీమియం సీట్ల ధరలు రూ. 3,000 వరకు ఉండగా, ముంబైలో కొన్ని లేట్ నైట్ షోల టికెట్ ధర ఏకంగా రూ. 3,300కు చేరింది. భారతదేశంలో ప్రస్తుతం విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన సినిమా టికెట్లలో ఇవి ఒకటిగా నిలిచాయి.
అయితే ఈ భారీ ధరలు నోలన్ క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. టికెట్ల ధరలు అంత ఎక్కువగా ఉన్నప్పటికీ, బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పలు షోలు పూర్తిగా అమ్ముడైపోయాయి. కాగా, నగరాల వారీగా టికెట్ ధరలలో ఉన్న భారీ వ్యత్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకే సినిమా అనుభవానికి నగరాన్ని బట్టి, షో టైమింగ్‌ను బట్టి ఇంత తేడా ఎందుకు ఉందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించినప్పటికీ, భారతదేశంలోని చాలా థియేటర్లలో నోలన్ సినిమాలకు ప్రత్యేకమైన ‘ఐమాక్స్ 70ఎమ్ఎమ్’ (IMAX 70mm) ఫార్మాట్లో ప్రదర్శించే సాంకేతికత లేదనే విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్‌పై ఎక్స్‌లో అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. పూణే ఐమాక్స్‌లో రూ. 3,000 ధర పలకడం భారతదేశంలోనే అత్యధిక టికెట్ ధర అని, భారత్‌లో క్రిస్టోఫర్ నోలన్ ఒక బ్రాండ్ అని ఒకరు పోస్ట్ చేయగా, సినిమా ప్రమోషన్ల కోసం దర్శకుడు కానీ, నటీనటులు కానీ ఇండియాకు రాకపోయినా కేవలం నోలన్ అనే పేరుతోనే నిమిషాల్లో టికెట్లు అమ్ముడైపోవడం ఆయన లెగసీకి నిదర్శనమని మరొకరు పేర్కొన్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ రాసి, దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం హోమర్ రాసిన పురాణ గాథ ఆధారంగా రూపొందింది. ట్రాయ్ పతనం తర్వాత ఇథాకా రాజు ఒడిస్సియస్ తన స్వగృహానికి చేరుకోవడానికి చేసిన ప్రమాదకరమైన ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో ఒడిస్సియస్‌గా మాట్ డామన్, టెలిమాకస్‌గా టామ్ హాలండ్, పెనెలోప్‌గా అన్నే హాత్వే నటిస్తున్నారు. వీరితో పాటు జెండాయా (అథీనా పాత్రలో), రాబర్ట్ ప్యాటిన్సన్ (యాంటినస్ పాత్రలో), షార్లిజ్ థెరాన్ (సిర్స్ పాత్రలో), లుపిటా న్యాంగో, జోన్ బెర్న్తల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నోలన్ కెరీర్లో 13వ ఫీచర్ ఫిలింగా వస్తున్న ఈ చిత్రాన్ని సింకోపి బ్యానర్‌పై ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.