– నల్లగొండ ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ
నీలగిరి, ఆగస్టు 05 : తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని నల్లగొండ ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని బీట్ మార్కెట్, నాగార్జున కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలు, గర్భిణీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం చిన్నారుల వయస్సు, బరువు, ఎత్తు కొలతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిపాల వల్ల చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతులుగా ఎడుగుతారని తెలిపారు. 8 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం అందిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టించాలన్నారు. అంతకుముందు ఆయా కాలనీల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సావిత్రమ్మ, మంగా, ఆయాలు అమరావతి, సుమలత, ఆశ వర్కర్ ధనలక్ష్మీ, లక్ష్మీ, అనూష, రేణుక, మౌనిక పాల్గొన్నారు.

‘పుట్టిన బిడ్డకు గంటలోపే ముర్రుపాలు తాగించాలి’