Harish Rao | వ్యవసాయ కూలీలకు భరోసా ఇచ్చే విషయంలో ప్రభుత్వం కోతలు విధించడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కూలీలు అందరికీ ఏడాదికి 12వేలు ఇస్తాం అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కూలీలు గ్రామాల్లో ఉంటే.. గ్రామాల్లో దరఖాస్తులే తీసుకోలేదని అన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీలో 52లక్షల మంది కార్డులు, 1.4కోట్ల మంది కూలీలు ఉన్నారని తెలిపారు. 20 రోజులు పని చేసే వారికే అని నిబంధనలు పెట్టి, అర్హులను 25 లక్షలకు కుదించారని ఆరోపించారు. ధరణిలో పెట్టి ఆ 25లక్షల్లో గుంట భూమి ఉన్నా ఇచ్చేది లేదని అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారని తెలిపారు. కోటి మంది వ్యవసాయం కూలీలు ఉంటే, ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారని.. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలను నిర్ణయించాల్సింది గ్రామాల్లో అని తెలిపారు. ఎవరు కూలీకి పోతున్నారో.. ఎవరు పోవట్లేదో గ్రామాల్లో అడగాలని.. అంతేగానీ కంప్యూటర్ డేటా ఆధారంగా కోతలు విధించడం దుర్మార్గమని మండిపడ్డారు. 94 శాతం మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎగ్గొట్టి, ఆరు శాతం మందికి ఇస్తామంటే.. అది ఎగ్గొట్టడమే కదా అని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు భరోసా ఇవ్వడానికి ఈజీఎస్ నిబంధన ఎందుకు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే ఎక్కువ మంది కూలీలు ఉంటారని తెలిపారు. దళిత, గిరిజన, బీసీల నోళ్లు కొట్టడానికి చేతులు ఎట్లా వచ్చాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే,
ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తరట. ఇదేం న్యాయం ?– మాజీమంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు. pic.twitter.com/RC6X67KbiR
— Office of Harish Rao (@HarishRaoOffice) January 18, 2025
అప్పు కట్టాలని వేధిస్తే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి చనిపోయిండని హరీశ్‌రావు తెలిపారు. రుణమాఫీ అయిపోతే ఈ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. ఈ రైతును చంపింది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. రుణమాఫీ అయిపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. రుణమాఫీ విషయంలో రేవంత్ మోసం వల్లే రైతు చనిపోయాడని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ ఇలా అన్ని విషయాల్లో రైతులను రేవంత్ రెడ్డి తీవ్రంగా మోసం చేశాడని విమర్శించారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు 10లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
రైతులందరికి రుణమాఫీ చేసేశామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.
పూర్తి రుణమాఫీ చేసినట్లయితే.. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?ఇది ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యే.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/rPXPDk3s7M
— BRS Party (@BRSparty) January 18, 2025
సెంటు భూమి ఉన్నా కూడా కూలీలకు రైతు భరోసా ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని హరీశ్‌రావు అన్నారు. మీరిచ్చే భరోసా ద్వారా వారికి రూ.750 వస్తుంది.. దాని కోసం ఏటా ఇవ్వాల్సిన రూ.12వేలు ఎగ్గొడతామంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఎకరం లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలీలు కూడా వ్యవసాయ కూలీలే కదా.. వారికి భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పట్టణ కూలీలకు కూడా భరోసా అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ముందే ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.