హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ విమర్శలు గుప్పించారు. అటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడుపై తాము 40 రోజులు కోట్లాడామని చెప్పారు. కిరణ్ కుమార్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తాడనే ఆశతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి నోరు మూసుకున్నాడని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పదవులు వదులుకున్న చరిత్ర తమదని,
ద్రోహ చరిత్ర ఉత్తమ్‌దని చెప్పారు.
కృష్ణా జలాలకు సంబంధించి సెక్షన్ 3 తీసుకొచ్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు అన్నారు. కృష్ణా జలాల కోసం పోరాడింది తామని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను వ్యతిరేకించింది తామేనని చెప్పారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండడానికి కారణం కాంగ్రెస్ పార్టేనని ఆరోపించారు. వారి చేతగాని తనంవల్ల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఉత్తమ్ తప్పులు మాట్లాడి సభను తప్పు దోవ పట్టించారని ఆరోపించారు.
Slbc గురించి నాడు కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని, పులిచింతల నిర్వాసితులకు తాము సహాయం చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తాము ఆయన ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశామని తెలిపారు. కేసీఆర్ సభలో ప్రతిపక్ష నాయకుడని, ఆయనను అగౌరవపర్చడం సబబు కాదని సూచించారు. తమకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని, సభలో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కోరామని అన్నారు.
కానీ రేవంత్‌రెడ్డి విజ్ఞత, సంస్కారం లేకుండా మాట్లాడారని హరీశ్‌రావు అన్నారు. ఇంత నీచపు మాటలు మాట్లాడే సీఎంను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఉత్తమ్ కుమార్ పచ్చి అబద్దాలు మాట్లాడారని, కృష్ణా జలాలలో అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టేనని ఆరోపించారు. విద్యాసాగర్ వెళ్లి తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నారని, అప్పుడు ప్రాజెక్టులు లేక 299 టీఎంసీలకు ఒక్క సంవత్సరానికి ఒప్పందం చేసుకున్నారని చెప్పారు.
తెలంగాణ అధికారులు ఈ సంవత్సరం ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. అప్పుడు పోతిరెడ్డిపాడు కోసం 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది తామేనని మాజీ మంత్రి చెప్పారు. నాడు పదవుల కోసం ఉత్తమ్ పెదవులు మూసకున్నారని, తెలంగాణకు ద్రోహం చేసి ఉత్తమ్ మంత్రి అయ్యారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి చంద్రబాబు వద్ద భోజనం చేసి కృష్ణ నీటిని అప్పగించారని ఆరోపించారు.