Harish Rao : కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు అన్నారు. తాను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి చిట్‌చాట్ పెట్టడం చూడలేదని చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్లు అన్నం పెడతాయా..? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు వాస్తు భయం పట్టుకుందని, అందుకే సచివాలయానికి పోవటం లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాలుగు వేల మంది సర్పంచ్‌లుగా గెలిచారని, బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి పోలీసులు లేకుండా ఓయూకు వస్తానని చెప్పారని, కానీ పోలీస్ పహారా మధ్య వచ్చారని అన్నారు. ఇరగేషన్పై పీపీటీని స్వాగతిస్తున్నామని, పీపీటీపై అసెంబ్లీలో తమకూ సరిపడా అవకాశం ఇవ్వాలని కోరారు.
అసెంబ్లీలో తమ గొంతు నొక్కడం, మైక్ కట్ చేయడం లాంటివి చేయవద్దని అన్నారు. ఎవరి వాదన నిజమో ప్రజలు తేలుస్తారని చెప్పారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్ఎస్కు ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు ప్రభుత్వం భయపడుతుందని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బట్టలు విప్పుతామని వ్యాఖ్యానించారు.