Harish Rao | మహిళా సీనియర్ జర్నలిస్టు రేవతి అరెస్టును మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా? నియంతృత్వ రాష్ట్రమా అని నిలదీశారు. సమస్యలపై నిలదీస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులతో సమాధానం చెబుతుందని విమర్శించారు.
సీనియర్ జర్నలిస్టు రేవతిని ఉదయం 5 గంటల ప్రాంతంలో అక్రమ అరెస్టు చేయడం చూస్తుంటే.. ఈ ప్రభుత్వం ఎంత అభద్రతాభావం, పిరికితనంతో ఉందో అర్థమవుతుందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రశ్నించే గొంతులను, పత్రికా స్వేచ్ఛను అణిచివేయడానికి చేసిన ఈ సిగ్గుచేటు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
బుధవారం ఉదయం 5 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు రేవతి ఇంటికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. అలాగే రేవతికి చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీసును సీజ్ చేశారు. రైతుబంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకుగానూ అక్రమ కేసులు బనాయించి రేవతిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.