వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. పట్టాల కింద ఇరుక్కున్న వారిని వెంటనే రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా మామునూరు వద్ద రైలు పట్టాలను తీసుకెళ్తున్న లారీ అదుపుతప్పి రెండు ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై బోల్తాపడింది. ఈ క్రమంలో పట్టాలు మీద పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ కాలు కూడా విరిగిపోయింది. ఇనుప రాడ్ల కింద మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.