Harish Rao | జనగామ జిల్లాలో RG TV జర్నలిస్టు, గిరిజన బిడ్డ రాజ్ కుమార్‌ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల అభిప్రాయాలను యధాతథంగా తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తే ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు.
మీ దుర్మార్గ పాలనపై అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నది వాస్తవం కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీన్ని యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలైన జర్నలిస్టులను కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం ఇందిరమ్మ రాజ్యంలో నిత్యకృత్యం కావడం శోచనీయమని అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారని గురువారం రాత్రి 11 గంటల సమయంలో RGTV జర్నలిస్ట్ రాజ్ కుమార్‌ని వర్ధన్నపేట ఏఎస్ఐ రాజు పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. రాత్రి 11:30 గంటల సమయంలో రాజకుమార్‌ని కస్టడీలోకి తీసుకుంటున్నామని, వీడియోలు తీయనియకుండా, మాట్లాడినీయకుండా కారులో ఎక్కించుకొని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నుండి జాఫర్ గాడ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అక్కడి నుండి పాలకుర్తికి తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు.. ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా రాజకుమార్ ఆచూకీ లేని పరిస్థితి ఉందని ఆర్జీటీవీ సిబ్బంది పేర్కొన్నారు.
.