Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేవి అన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నాడని అన్నారు. తడిబట్టలతో పాలమూరు కురుమూర్తి గుడికి పోదామని.. ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దామా అని సవాలు విసిరారు. కురుమూర్తి గుడికి వస్తావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది ఎవరని ప్రశ్నించారు. రెండు దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీనే కదా పాలమూరు ప్రాజెక్టులను మోసం చేసిందని నిలదీశారు. పదేండ్లు తెలుగుదేశం పార్టీ, పదేండ్లు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 20 ఏండ్ల పాటు కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. ఆ 20 ఏండ్లలో 26 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. నీళ్ల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల దగ్గరే పడుకొని రాత్రింబవళ్లు కష్టపడి 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉండి అబద్దాలు చెప్తే నిజమవుతాయా అని మండిపడ్డారు.
మహబూబ్ నగర్‌కు అన్యాయం చేసింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మహబూబ్ నగర్‌లోని పొలాల్లో కృష్ణా జలాలు పారించింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు పేరు మార్చి ఇస్తానన్న రైతు భరోసా 15 వేలు ఏమైందని ప్రశ్నించారు. వానాకాలం లేదు.. యాసంగి లేదు.. ఏమైంది నీ రైతు భరోసా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 9 వేల రూపాయల బాకీ పడిందని అన్నారు. రైతు భరోసా ఎప్పుడిస్తారో ఊర్లలో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని రైతులకు పిలుపునిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ పెద్ద పెద్దోళ్ళకు రైతు బంధు ఇస్తున్నాడని అన్నారని.. కాంగ్రెస్ వచ్చాక అర్హులకే ఇస్తామన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 68 లక్షల మంది రైతులకు ఇస్తే.. కాంగ్రెస్ 70 లక్షల మంది రైతులకు ఇస్తామని అంటోందని తెలిపారు. మరి ఏమైంది నీ కోతలు అని ప్రశ్నించారు. పెద్దోళ్ళకు రైతు భరోసా ఎందుకు బంద్ చేయలేదని నిలదీశారు. ఆ రోజు ప్రజలను రైతులను రెచ్చగొట్టినావు.. నువ్వు చెప్పింది మోసం దగా అని అర్థమవుతుందని స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్న @revanth_anumula
తడి బట్టలతో పాలమూరు మహిమన్విత కురుమూర్తి స్వామి గుడికి పోదాం.?
ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దాం.?
నేను రెడీ, నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి ? pic.twitter.com/0ihNHxSZ4w
— Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2025