Harish Rao | మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యు కుహరంలోకి నెట్టారు. వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారని మండిపడ్డారు. నీకు నిజాయితీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు! దోషులు ఎవరో తేల్చు అని హరీశ్‌రావు సవాలు విసిరారు. పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు పూతలు బంద్ చెయ్ అని మండిపడ్డారు. ఒర్రితే పనులు కావు ఒళ్ళు వంచి పని చేస్తే పనులవుతాయని స్పష్టం చేశారు.
15 నెలలు అయినా నీకు జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం అని హరీశ్‌రావు విమర్శించారు. అసలు వాస్తవాలు మీకు తెలియక కాదు, అతి తెలివితో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం నీది అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 3900 కోట్లు ఖర్చు చేసి ఎస్ ఎల్ బీ సీ సొరంగం 11.48 కిలోమీటర్లు తవ్విన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. నిధులు ఖర్చు చేయకుండానే 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు అయ్యాయా? మీ హయాంలో డిండి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేది అది అసలు నిజమని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పనులు ఆగలేదు కనుకే రేవంత్ రెడ్డి అపుడు ఏం మాట్లాడలేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ అంటే పచ్చని పంటలు, రేవంత్ రెడ్డి అంటే పచ్చి అబద్దాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక సంబంధాలను నిర్వహించామన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున సూట్ కేసులు మోయలేదని.. ప్రజాభవన్‌లో కూర్చోబెట్టి పాదసేవ చేయలేదని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్చగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నడని హరీశ్‌రావు తెలిపారు. ఇదేందని మేం ప్రశ్నిస్తే అడ్డుకోవాల్సింది పోయి, మా మీద రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు. నీకు చాతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. బీజేపీతో పగలు కుస్తీ రాత్రి దోస్తీ అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. బీజేపీకి ఎందుకు స్వాగతం పలికారని అడిగారు. ఇప్పటివరకు ప్రమాదంపై బీజేపీ పల్లెత్తు మాట మాట్లాడలేదని అన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎన్డీయే స్పందించదని.. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ, ఐటీ విచారించవని హరీశ్‌రావు విమర్శించారు. ఒకరు కొట్టినట్టు, మరొకరు ఏడ్చినట్టు చేసే డ్రామాలు బంద్ చేయాలన్నారు. ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకండని సూచించారు.