Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వంద సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు, ప్రోఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి గారికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటామని హరీశ్‌రావు తెలిపారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, ఇతర ఉన్నతాధికారులను హెచ్చరించారు. రాష్ట్రంలో 12 వేల కోట్ల ప్రాజెక్టులను కేవలం నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ మిస్ వరల్డ్ ఇంగ్లండ్ కంటెస్టెంట్ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనే వార్తలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షలు నిర్వహిస్తున్నావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish దమ్మున్న సవాల్ 🔥 pic.twitter.com/Exk77VqVBz— BRS Party (@BRSparty) June 2, 2025