Gattu Ramachandra Rao | కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు నిలదీశారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు. బీసీ గణన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తప్ప మరొకరు దొరకలేదా? అంటూ ప్రశ్నించారు. బీసీల్లో సమర్థులు లేరా?.. ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట చెప్పెనదాన్నే అసెంబ్లీ చర్చించింది తప్ప.. కొత్తగా చేసిన కార్యాచరణ ఏంటని నిలదీశారు. రేవంత్ రెడ్డి అసలు సీఎంలా వ్యవహరిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
జనగణన పేరిట అసెంబ్లీ సమావేశాలకే జనగణమన పాడారని.. కులగణనలో వచ్చిన లెక్కల ప్రకారం.. 15 శాతం మంది అగ్రవర్ణాలు ఉన్నారు.. మరి రేవంత్ రెడ్డి కేబినెట్లో ముగ్గురే అగ్రవర్ణాల వారు ఉండాలని.. ఇందులో ఎవరు రాజీనామా చేస్తారో బీసీ మంత్రులు చెప్పాలన్నారు. 42శాతం తీర్మానాన్ని కేంద్రానికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. తీర్మానంలో కూడా అసలు సంగతి చెప్పకుండా సీఎం లిటిగెంట్‌గా వ్యవహరించారని.. సీఎం రేవంత్‌రెడ్డి భాష అణగారిన వర్గాలకు వ్యతిరేకమన్నారు. ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్ని కులాలను అవమానపరిచారని.. అధికారంలోనూ రేవంత్ తీరు అలానే ఉందన్నారు. కాంగ్రెస్‌లో బలమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల బీసీ జనాభా తగ్గించారన్నారు. మాకు సమాచారం ఉందన్నారు. అన్ని కులాల జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు.
మోదీకి భయపడే రేవంత్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయలేదన్నారు. బడే భాయ్, చోటే భాయ్ రహస్య ఒప్పందం మరో మారు బయట పడిందన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి మరో డ్రామా ఆడుతున్నారని.. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని పెడితే మరో పార్టీ ఓసీ అభ్యర్థిని పెడుతుందని.. జరిగేదేంటన్నారు. అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులను ఒకే చోట పెట్టడం చట్టబద్ధత ఉంటేనే జరుగుతుందని రేవంత్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సమగ్ర సర్వేను ఇపుడున్న అధికారులే చేశారని.. అప్పటికీ.. ఇప్పటికీ బీసీల జనాభా ఎలా తగ్గుతుందంటూ మండిపడ్డారు. జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 1.3 శాతం సంఖ్య పెరగాలని.. ఆ లెక్కన కులగణన ప్రకారం జనాభా పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.
సమగ్ర సర్వే మీద విచారణకు కొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని.. సమగ్ర సర్వే సంఖ్య మీద అపుడెవ్వరు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని.. విచారణ చేయాల్సి వస్తే కులగణన సర్వే మీదే సీబీఐ విచారణ జరగాలన్నారు. కావాలనే కొందరి ఇండ్లకు వెళ్లకుండా బీసీల జనాభాను తగ్గించారన్నారు. నా ఇంటికి కూడా ఎవరూ సర్వేకు రాలేదని.. బీసీలను అణచి వేసే సర్వే ఇది అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాదు సర్వే చేయాల్సింది కాదని.. చిత్రపటాలు.. సర్వే రిపోర్టును తగలబెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కరెక్టయితే కామారెడ్డి డిక్లరేషన్‌ను తగలబెట్టాలని.. సమగ్ర సర్వే రిపోర్టు బయట పెట్టలేదని అంటున్న వారంతా కులగణన రిపోర్టును ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. ఇది బీసీలకు సంబంధించిన సమస్య.. పార్టీలకు ఆతీతంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోని బీసీ నాయకుల మీద అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉందన్నారు. బీసీలకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.