హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత లోక్‌సభ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లో బీజేపీని గెలిపించడానికి అవయవదానం చేశారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, విప్ల నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా ఓట్లు తగ్గి, బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్పై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి బీజేపీకి ఓట్లు బదిలీ చేసింది రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ విప్‌లేనని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందని విమర్శించారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి లాంటి సీట్లలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని వెల్లడించారు. అక్కడ బీజేపీ అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ పరోక్షంగా పనిచేసిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజిగిరినీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ అవయవదానం చేసిందని, సిద్దిపేటలో బీజేపీకి హరీశ్‌రావు ఓట్లు బదిలీ చేశారన్న సీఎం నిరాధార ఆరోపణలను ఎర్రోళ్ల తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకే ఆధిక్యం వచ్చిందని, ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీజేపీ గెలిచిందని, అంటే.. రేవంతే బీజేపీకి ఓట్లు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో 1.07 లక్షల ఓట్లతో 34 వేల మెజారిటీ వస్తే, ఈ సారి 23 వేలకు ఎందుకు తగ్గిందని నిలదీశారు. రేవంత్‌రెడ్డి, మంత్రులే బీజేపీకి అవయవ దానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికలు రెఫరెండం అన్న సీఎం రేవంత్ తన లక్ష్యంలో ఫెయిల్ అయ్యారని, రాష్ట్రంలో 17 సీట్లు ఉంటే 8 మాత్రమే గెలిచారని ఎర్రోళ్ల విమర్శించారు. ఆరు నెలల పాలనలో కాంగ్రెస్ విఫలమైనందుకే 8 సీట్లకు పరిమితమైందని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, విప్‌లు లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గి బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. పడిలేచిన కెరటంలా బీఆర్ఎస్ దూసుకొస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్పై పిచ్చి ప్రేలాపనలు బంద్ చేయాలని సీఎంకు సూచించారు.
బీఆర్ఎస్ బూడిద అయ్యిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి అధికార మదంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2014లో 11 ఎంపీ సీట్లు, 2019లో 9 ఎంపీ సీట్లు గెలుచుకున్నదని.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 8 సీట్లే సాధించిందని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు మార్కులు వేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ.. ఇప్పుడెందుకు తక్కువ తెచ్చుకున్నదో చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. అమరవీరుల జాబితా కూడా సరిగా తయారుచేయలేని అసమర్థుడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. గతంలో అనేక రాష్ర్టాల్లో అనేక పార్టీలు ఖాతా తెరవలేదని, తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయని, తెలంగాణలోనూ అదే జరగబోతున్నదని తెలిపారు. వెయ్యి మంది రేవంత్‌లు, వంద మంది మోదీలు వచ్చినా బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు.