తెలంగాణ అస్థిత్వం కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపాల్సింది తెలంగాణ వాదులు తప్ప తెలంగాణ ద్రోహులు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉత్సావాలు జరిపే పేటెంట్ బీఆర్ఎస్కే ఉందని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 1969లో జరిగిన ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా అని నిలదీశారు. ఆ ఉద్యమంలో అమరులకు గుర్తుగానే గన్ పార్క్ దగ్గర స్థూపం కట్టారని గుర్తుచేశారు. మలి దశ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను, యువకులను బలి తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర అంతా మోసం దగా అని విమర్శించారు. తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే అని ఎద్దేవా చేశారు.
ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ ఆరు నెలల్లో సీఎం రేవంత్ ఏనాడూ తెలంగాణ అమర వీరుల స్తూపం దగ్గరకు వెళ్లలేదని, జై తెలంగాణ అనలేదని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉత్సవాలు జరపడం తెలంగాణ వాదులు ఎవరూ హర్షించడం లేదన్నారు. తెలంగాణ ఉత్సవాల్లో పెట్టిన హోర్డింగ్‌లలో ఎక్కడా కూడా జై తెలంగాణ అని రాయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ చిహ్నాన్ని మారుస్తారేమో కానీ కేసీఆర్‌తో తెలంగాణకున్న స్నేహాన్ని మార్చలేరని స్పష్టం చేశారు. తమ అరాచకాలను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరపాల్సింది తెలంగాణ వాదులు తప్ప తెలంగాణ ద్రోహులు కాదన్నారు. బీఆర్ఎస్ ఆద్వర్యంలో జరిగే మూడు రోజుల ఉత్సవాలను తెలంగాణ వాదులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.