హైదరాబాద్: కాంగ్రెస్ డిక్లరేషన్లు డెత్ డిక్లరేషన్లుగా మారాయని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) విమర్శించారు. దోకేబాజ్ కాంగ్రెస్‌కు జూటే బాజ్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఖర్గే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన రాష్ట్రానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ‘హలో నిరుద్యోగి.. చలో సెక్రెటేరియట్’ పేరుతో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం . మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 11 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు . కాంగ్రెస్ నేతలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి . కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు రాటిఫికేషన్ తప్ప, కొత్తగా చేసిందేమి లేదు. కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లకు రంగులు వేసి బ్యూటీఫికేషన్ చేస్తున్నారు.
ఖర్గే ఎలక్షన్లప్పుడే రాష్ట్రానికి వస్తున్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు డెత్ డిక్లరేషన్లుగా మారాయి. దోకేబాజ్ కాంగ్రెస్‌కు జూటే బాజ్ అధ్యక్షుడు ఖర్గే. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఖర్గే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు?. ఖర్గే స్వయంగా చేవెళ్లలో విడుదల చేసిన ఎస్సీ డిక్లరేషన్‌కు దిక్కు లేకుండా పోయింది. డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోకుండా పోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ రాహుల్, ప్రియాంక, రేవంత్ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కోదండరాం కూడా ఉద్యోగం తీసుకుని కోవర్ట్ కోదండరాంగా మారారు. కాంగ్రెస్ నాయకులు పదవులు రాగానే పెదవులు మూసుకుంటారని మరోసారి రుజువు అయింది. నిరుద్యోగులను అరెస్టు చేస్తున్నా నోరు మెదపరా?.
జై భీం, జై బాపు, జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ ఊదర గొడుతోంది. ఆచరణలో ఆ నినాదాలకు విరుద్ధంగా వెళ్తున్నారు. గాంధీ కుటుంబాన్ని చూసి గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక గాంధీ కుటుంబం తెలంగాణకు మొహం చాటేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ జన్మలో అధికారంలోకి రాదు. ఖర్గేకు ఏ సమస్య గురించి చెప్పినా అధిష్ఠానం చూసుకుంటుందని అంటున్నారు. తానే అధిష్ఠానం అనే విషయం మరచిపోతున్నారు. కాంగ్రెస్ నేతలకు ఎంత సేపు తమ పదవుల పంచాయతీయే తప్ప ప్రజల క్షేమం పట్టడం లేదు. కర్ణాటకలో మోసం చేసినట్టే తెలంగాణలో మోసం చేయాలనుకుంటే కుదరదు. ఇది తెలంగాణ గడ్డ.. ఉద్యమాల గడ్డ.
రాంచరణ్ గ్లోబల్ స్టార్ అయితే రేవంత్ గోబెల్స్ స్టార్‌గా మారారు. కాంగ్రెస్‌కు ఓట్లేయాలని ఖర్గే ఏ మొహం పెట్టుకుని ప్రజలను అడుగుతారు?. ఎపుడైనా తెలంగాణలో హామీల అమలుపై ఖర్గే సమీక్ష చేశారా?. మీటింగ్‌లు పెట్టారా?. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు ఎలా అడుగుతుంది. జాబ్ కేలండర్ జాబ్ లెస్ కేలండర్‌గా మారింది. బీఆర్ఎస్ను ఓడించడానికి నిరుద్యోగులు ఎలా పని చేశారో.. ఇపుడు కాంగ్రెస్ ఓటమికి అలా పని చేయాలి. ఖర్గే.. ఎన్నికల ఖర్గేగా మారిన తీరును ఎండగడుతాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండ ఎప్పటికీ ఉంటుంది. ఈ దద్దమ్మ ప్రభుత్వం దిగివచ్చేదాకా కొట్లాడుతాం.
రేవంత్ రెడ్డి 60 వేల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారని బీఆర్ఎస్ నేత వాసుదేవ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. జాబ్ కేలండర్‌ను అమలు చేయనందుకు కాంగ్రెస్ నేతలు చెంపలు వేసుకోవాలి. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారు. అసెంబ్లీలో జాబ్ కేలెండర్ విడుదల చేసి అమలు చేయలేదు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామనేది వట్టి బోగస్. వెంటనే నిరుద్యోగులను చర్చకు పిలవాలి. ఇచ్చిన నోటిఫికెషన్లలోనూ నిరుద్యోగులకు అన్యాయం చేశారని విమర్శించారు.
గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి రూపంలో గాడ్సే చొరబడ్డారని బాలరాజు యాదవ్ అన్నారు. జై భీం, జై బాపు, జై సంవిధాన్ వట్టి నినాదాలుగా మారిపోయాయి. బీజేపీ స్కూల్, టీడీపీ కాలేజీ అంటున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌కు ఎలా న్యాయం చేస్తారో ఖర్గే ఆలోచించాలి. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. హామీల గురించి అడిగితే పోలీసులతో అరెస్టు చేస్తున్నారు. ఖర్గే ఓ రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడిగా మారారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ ఎజెండాను ఎదిరిస్తాం. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు అమలు చేయక కాంగ్రెస్ నవ్వులపాలు అయింది. అందాల పోటీల మీదే కాంగ్రెస్ నేతలు శ్రద్ధ చూపారు తప్ప.. హామీల మీద చూపడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.