హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అంటేనే నయవంచక పార్టీ అని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో పెద్ద బోగస్, బక్వాస్ అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అడిగితే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి తలోమాట మాట్లాడుతున్నారని, నిరుద్యోగులతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులపై సీఎం, మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని చెప్పా రు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు అడుగుతున్నారని, సీఎం, మంత్రులు వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, వారికి సమాధా నం చెప్పాల్సి వస్తుందని ముఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు.
గ్రూప్ -1 విషయంలో 1:100 పిలుస్తామన్నది కాంగ్రె స్ నేతలేనని, గతంలో భట్టి విక్రమార స్వయంగా అసెంబ్లీలో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. దీనిపై భట్టి ఇప్పుడెందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఎన్నికల కోడ్ కారణం గా ఇవ్వలేకపోయామని మంత్రి పొన్నం అంటున్నారని, జాబ్ క్యాలెండర్‌కు అవసరమైన సిబ్బందిని టీజీపీఎస్సీకి ఇస్తున్నామని, నిధులు సమకూరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని ఇలా తలోరకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.
‘30 వేల ఉద్యోగాలు మీరు భర్తీ చేయలేదని నిరూపిస్తాం.. సీఎం, మంత్రులు క్షమాపణ చెబుతారా?’ అంటూ ఎర్రోళ్ల సవాల్ విసిరారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినట్టు నిరూపిస్తే ముకునేలకు రాస్తానని చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో 41, 42 పేజీల్లో నోటిఫికేషన్ల తేదీలున్నాయని, వాటిలో దేనినీ అమలు చేయలేదన్నారు. నియామక పరీక్షలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మ్యానిఫెస్టోలో చెప్పారని, కానీ డీఎస్సీ, గ్రూప్-1 ఫీజుల ద్వారానే ప్రభుత్వానికి రూ.42 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగేందర్‌గౌడ్, పల్లె రవికుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, గోసుల శ్రీనివాస్ యాదవ్, రామ్మూర్తి యాదవ్ పాల్గొన్నారు.