కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మాత్రం 100 కార్లతో తిరుగుతున్నారని విమర్శించారు. వార్డు మెంబర్ కాని.. బోర్డు మెంబర్ కాని తిరుపతి రెడ్డికి ఏ హోదాలో ఎస్కార్ట్ వాహనాలు ఇస్తున్నారో సీఎస్, డీజీపీ, కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎంపీ డీకే అరుణ వెళ్తే వెనక్కి పంపిన పోలీసులు.. తిరుపతిరెడ్డికి ఎదురెళ్లి పూల బొకేలను ఏ హోదాలో ఇచ్చి కలెక్టర్లు స్వాగతం పలుకుతారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏడో గ్యారెంటీ కింద రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నదని, లగిచర్ల తండాల్లో గిరిజనులపై రాత్రికి, రాత్రి రజకార్ల తరహాలో దాడులు చేశారని విమర్శించారు. రజాకార్ల నాయకుడిగా తిరుపతిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో గిరిజనుడిని గంట సేపు పోలీసులు కొట్టారని, సమైక్య పాలనలో కూడా ఇలాంటి దారుణ ఘటనలు జరుగలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇస్తే.. ఆ భూములను సీఎం రేవంత్రెడ్డి తన అల్లుడి ఫ్మారా కంపెనీ కోసం లాక్కుంటున్నారని విమర్శించారు. లగచర్ల గిరిజనుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు.