Errabelli | పెద్ద వంగర, ఫిబ్రవరి 12: బ్రోకర్ మాటలతో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారని, గత 15 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు శూన్యం అని స్పష్టం చేశారు. అభివృద్ధి పథకాల్లో పేర్ల మార్పుతోనే ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ ఆనందంలో ఉందన్నారు.
తేదీల్లో మార్పు, దేవుళ్లపై ఓట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరని దయాకర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, పార్టీ ఎమ్మెల్యేలకు సమన్వయం కొరబడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంలో ఒక తీరు రాష్ట్రంలో ఒక తీరు జరుగుతుండడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎం కావడంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, వృద్ధులకు పెన్షన్లతోపాటు కౌలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అన్ని పూర్తి చేశామని ప్రకటనలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేక ఇప్పటికి మంత్రివర్గ విస్తరణ చేయలేదని దయాకర్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం లేకుండానే వరంగల్ పర్యటనకు వస్తానని రాహుల్ గాంధీ ప్రకటించడం లోనే ఇది అర్థమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు జెడ్పీటీసీలు టీఆర్ఎస్కే రావడం ఖాయమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఏ ఒక్కరు అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.