Errabelli Dayakar Rao | దీపావళి పండుగకు ముందే తెలంగాణ పాలిటిక్స్‌లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సెటైర్లు వేశారు. పొంగులేటి చెప్పింది కరెక్టేనని.. దీపావళికి 100 శాతం బాంబులు పేలబోతున్నాయని చెప్పారు. అయితే ఆ బాంబులు కాంగ్రెస్ పార్టీలోనే పేలబోతున్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు వస్తున్న ముప్పును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే పసిగట్టారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తలోదారి అయ్యారని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎవరి కుర్చీలు కదులుతాయో త్వరలోనే చూస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.