హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు.. క్యాలెండర్ కూడా లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడు తూ.. నిరుద్యోగ యువత వల్లే కాంగ్రెస్ గెలిచిందని, ఇప్పుడు వారిపైనే కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఉద్యోగాల సంఖ్య, నోటిఫికేషన్ తేదీలు స్పష్టంగా ఉంటేనే జాబ్ క్యాలెండర్ అవుతుందని, జాబ్ క్యాలెండర్‌పై తన మిత్రపక్షం డీఎంకేను చూసైనా కాంగ్రెస్ నేర్చుకోవాలని చురక అంటించారు. ప్రజాభవన్‌కు వెళ్లిన జీవో 46 బాధితులకు పిడిగుద్దులే మిగిలాయని వెల్లడించారు. జీవో 46 బాధితులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం స్పందించలేదని, కేటీఆరే ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరినట్టు వివరించా రు. ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు.