హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తొలి ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాష వీధిరౌడీ కన్నా అధ్వానంగా ఉన్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసీఆర్‌ను ఒక సంవత్సరంలో ఫినిష్ చేస్తా? కేటీఆర్‌ను హరీశ్‌రావుతో ఫినిష్ చేయిస్తా అంటావా? సీఎం వాడాల్సిన భాషేనా? అని ధ్వజమెత్తారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌లాగా, దావూద్ ఇబ్రహీంలా రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు తెలంగాణ ప్రజలకు ఆద్యుడిగా ఉండాలి కానీ, కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టినట్టుగా ఉండవద్దని హితవు పలికారు. ప్రతిపక్ష నేతను ఫినిష్ చేయడానికి, ఇండ్లు కూల్చడానికి రేవంత్‌ను సీఎంను చేశారా? అని అన్నారు. క్రిమినల్ సీఎంలా రేవంత్ పద్ధతి ఉన్నదని, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి క్రిమినల్ అయితే ఇక సమాజం ఎట్లా? అని ప్రశ్నించారు. సీఎం సీటులో కూర్చున్నాక కూడా రేవంత్ మారడం లేదని, కుక్కతోక వంకర అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ లివింగ్ లెజెండ్
లివింగ్ లెజెండ్ కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అంటావా? రేవంత్ అసలు నువ్వు మనిషేనా? అని దాసోజు ప్రశ్నించారు. రేవంత్ ముఖ్యమంత్రా? లేక ఆంధ్రపాలకుల పాలెగాడా? అని నిలదీశారు. రేవంత్ సమైక్యవాదుల చెప్పులు మోస్తున్నపుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. కేసీఆర్ పేరు మార్చడానికి గోడ మీద పెయింట్ కాదు.. తెలంగాణ ఆత్మ కేసీఆర్. రేవంత్ కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ కట్టిందే, నడుస్తున్న రోడ్లు కేసీఆర్ నిర్మించినవే, తాగుతున్న నీళ్లు కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా తెచ్చినవే అని పేర్కొన్నారు.