ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం అమానుషమని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను ఏడాది దాటుతున్న అమలు చేయకపోవడంతో ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఏడాది దినం జరుపుకోవడం షాడిస్ట్ చర్యగా భావిస్తున్నామని మండిపడ్డారు.
పాలన వైఫల్యాలు, తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చడం పట్ల ప్రతిపక్ష బాధ్యతతో నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ టార్గెట్‌గా కేసులు నమోదు చేస్తున్నారని దేవీప్రసాద్ అన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల సమస్యలు, మీరు ఇచ్చిన హామీల అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేసుల నుంచి ఎలా రక్షించుకోవాలో ఉద్యమకారులుగా తమకు తెలుసు అని చెప్పారు. ఇప్పటికైనా ఆరు గ్యారంటీలపై దృష్టి పెట్టాలని సూచించారు. మా నాయకులపై పెట్టిన కేసులను ప్రజలు అవార్డులుగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శిక్షించడం ఖాయమని అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.