హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో ఉద్యోగులను అన్నిరకాలుగా మోసం చేసిందని, ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 317 జీవో సమస్యను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో పరిష్కరిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు నెలలు కాలయాపన చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, భుజంగరావుతో కలసి దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
స్థానికత అంశాన్ని సబ్ కమిటీ పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఉద్యోగులు సీఎంవో చుట్టూ తిరుగుతున్నా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని, 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లే తప్ప రేవంత్‌రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదని, ఉద్యోగుల ఒక్క డిమాండ్‌ను కూడా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.