హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నాయకుడిగా మాజీమంత్రి హరీశ్‌రావు ప్రజాసమస్యల గురించి మాట్లాడితే, ఆ అంశాలను పక్కదోవ పట్టించేలా మంత్రి శ్రీధర్‌బాబు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్‌రావుపై మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.
మంగళవారం తెలంగాణభవన్‌లో దేవీప్రసాద్ మాట్లాడుతూ.. హరీశ్‌రావు లేవనెత్తిన డిమాండ్లలో తప్పులుంటే లేవనెత్తాలిగానీ, తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం ఏమిటని విమర్శించారు. అంగన్వాడీలు, ఆశ వర్కర్లకు దేశంలోనే అత్యధిక జీతాలు పెంచింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ‘వేరే రాష్ట్రం నుంచి నేర్చుకోవడం ఏమిటి? అని శ్రీధర్‌బాబు అంటున్నారు.
అదే చంద్రబాబు పార్టీ కార్యాలయానికి తన సహచర మంత్రి వెళ్లలేదా? గాంధీభవన్‌లో టీడీపీ జెండాలు ఎగరలేదా? ఇవి శ్రీధర్‌బాబుకు నచ్చుతాయా?’ అని నిలదీశారు. నిరుద్యోగుల డిమాండ్లపై హరీశ్‌రావు చేసిన సూచనలపై శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించాలని సూచించారు. ఉద్యోగుల డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీవో 46పై తమ పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని పది రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఇదేనా ప్రజారంజక పాలన, ప్రజా పాలన? అని ఎద్దేవా చేశారు. ‘ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వలేదు. సీపీఎస్‌పై ఇంతవరకు స్పందనలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వటం లేదు. పీఆర్సీ నివేదికను ఆరు నెలల్లో ఇస్తామన్నారు. దాని గురించి పట్టించుకున్న నాథుడే లేరు’ అని విమర్శించారు.
బహిరంగ చర్చకు సిద్ధం: వాసుదేవరెడ్డి
కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. హరీశ్ లాంటి నిఖార్సయిన ఉద్యమకారుడి గురించి మాట్లాడే స్థాయి వెంకట్‌కు లేదని మండిపడ్డారు. ‘చర్చకు హరీశ్‌రావు కాదు.. నేను వస్తా’ అని వెంకట్‌కు సవాల్ విసిరారు. ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. నిరుద్యోగులను ఎమ్మెల్సీ వెంకట్ బెదిరిస్తున్నారని.. ఖబర్దార్ వెంకట్, నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోబోం అని హెచ్చరించారు. వెంకట్ ఇంకా పరిణతి చెందాలని, ఏదీపడితే అది మాట్లాడితే ఊరుకోమని నిప్పులు చెరిగారు.