హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పుడు వా టిని మరిచిపోయిందని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ విమర్శించారు. ఉద్యోగులకు భ్రమలు కల్పించి ఇప్పుడు గాలికొదిలేయడం తగదని చెప్పారు. శనివా రం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మె ల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికారంలోకి రాగానే పెండింగ్ డీఏలను చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. కనీసం ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న డీఏ విడుదల నిర్ణయాన్నైనా అమలు చేయాలి. అది కూడా లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేస్తే బాగుంటుంది. ఒకటో తారీఖున ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చాలా మందికి రావడం లేదు’ అని దేవీ ప్రసాద్ తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించారని గుర్తుచేశారు. కానీ ఇటీవల కొందరు హరీశ్‌రావు వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉద్యోగులను ఆయన నుంచి దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని వెల్లడించా రు. కొంతమంది పనిగట్టుకొని చేస్తున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా శాఖకు మంత్రి లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పారు. మాడల్ స్కూళ్లలోని టీచర్లకు సమయానికి జీతాలు రావడం లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై సోషల్‌మీడియాలో కావాలనే దుష్ప్రచారం జరుగుతున్నదని తెలిపారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు అండగా నిలిచి ఎన్నో సమస్యలను పరిష్కరించారని వెల్లడించారు.