Devi Prasad | హైదరాబాద్ : త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు నిర్బంధం కొనసాగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవీ ప్రసాద్ మండిపడ్డారు. సీఎం పర్యటనలకు వెళ్తే చాలు.. బీఆర్ఎస్ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
కామారెడ్డి పర్యటనకు సీఎం వెళ్తున్నారంటే మా నేతలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్ తదితరులను హౌజ్ అరెస్ట్ చేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలి. ప్రజా సంక్షేమం గురించి అడిగితే అరెస్టులు చేస్తారా..? సీఎం పర్యటనలు చేస్తే అరెస్టులు చేస్తారు.. మేము ఆందోళన చేసినా అరెస్టు చేస్తారు. ఇదేనా ప్రజా పాలనా..? అని దేవీ ప్రసాద్ నిలదీశారు.
కేసీఆర్ స్టిక్కర్ పెట్టుకున్నందుకు ఓయూలో విద్యార్ధి నాయకుడి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లేకుండానే ఓయూ వస్తా అని చెప్పిన సీఎం ఈ రోజు కామారెడ్డిలో పోలీసులతో మా నేతలను ఎందుకు అరెస్టు చేయిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులను కూడా సీఎం జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా కాంగ్రెస్ హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది. తెలంగాణలో టీడీపీ అద్భుత పార్టీ అని రేవంత్ రెడ్డి మరోసారి గుర్తుకు తెస్తున్నారు. మరి టీడీపీ అద్భుత పార్టీ అయితే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరావు రేవంత్ రెడ్డి..? టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత మీద కదా..? కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ గొప్పతనం గురించి మాట్లాడతావా..? కాంగ్రెస్ శ్రేణులు సీఎం వైఖరి గురించి ఆలోచించుకోవాలి అని దేవీ ప్రసాద్ సూచించారు.
చీమలు పెట్టిన పుట్టలో పాములా రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. సబ్బండ వర్ణాల సంక్షేమం పక్కన పెట్టి సీఎం రేవంత్ నేరపూరిత పాలన కొనసాగిస్తున్నారు. జై తెలంగాణ స్పృహ రేవంత్‌కు లేదు కనుక తెలంగాణ వ్యతిరేక పాలన చేస్తున్నరు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరడం లేదు. సిబిఐ విషయంలో రేవంత్ అపుడు చెప్పింది ఏమిటీ..? ఇపుడు చేసింది ఏమిటీ..? కాళేశ్వరం విచారణను రేవంత్ ఢిల్లీ కాళ్ళ దగ్గర పెట్టాడు. అన్ని అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డివి ద్వంద్వ ప్రమాణాలే. అన్నింటిని బీఆర్ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలుస్తుందని దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు.