గజ్వేల్, మే 19 : రైతుల నుంచి పొద్దుతిరుగుడు, మక్కజొన్న, వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది రైతులతో కలిసి రాజీవ్ రాహదారిని దిగ్బంధించి వంటావార్పు చేపడుతామని హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో నిల్వ ఉన్న పొద్దుతిరుగుడు, మక్కజొన్న, వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు క్వింటాల్‌కు రూ.వెయ్యి చొప్పున నష్టానికి అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకుపైగా నిల్వ ఉన్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పండించిన పంటను అమ్ముకునే పరిస్థితిలో లేమని రైతులు దిగులు చెందుతున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్ర భుత్వం రైతులపై కక్షగట్టి పండించిన పంటను కొనడం లేదని మండిపడ్డారు. మక్కజొన్న బస్తాలకు గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మార్కెట్ షెడ్లలో పొద్దుతిరుగుడు నిల్వ ఉండటంతో వర్షాలు వస్తే ధాన్యం పూర్తిగా తడిసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. 50 లారీల వరి ధాన్యం ఉన్నదని, రోజుకు ఒక్క లారీ కూడా లోడింగ్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు, రైస్‌మిల్లర్లు, దళారీల వ్యవస్థ కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు.
లింగాలఘనపురం, మే 19 : ‘సర్కార్ నిర్లక్ష్యంతో ధాన్యం కాంటా కావడం లేదని ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తాం’ అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ కార్యకర్తకు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనెబావిలోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఏనెబావికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పొన్నం తిరుమలేశ్ ధాన్యం కొనకపోవడంతో ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా, వి ష యం తెలుసుకున్న రాజయ్య తిరుమలేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.