వరంగల్‌లో ప్రతిపక్ష నాయకుడిపై గూండాలతో దాడి చేయించడం ఇదే మొదటిసారి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు విమర్శనాత్మకంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
కేటీఆర్‌కు రాజేందర్ రెడ్డికి పోలికనా అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. కేటీఆర్ వరంగల్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చారని, నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారని గుర్తుచేశారు. చీరెలు, గాజులు మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. రాజేందర్ రెడ్డి గెలిచి పది నెలలు కాలేదని.. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించారు.
బడుగు బలహీనవర్గాల రిజర్వేషన్ కోసం తమిళనాడు వెళ్తే తప్ప అని దాస్యం వినయ్ భాస్కర్ నిలదీశారు. పార్టీ ఆదేశిస్తే రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు చెన్నై పోవడం తప్పా అని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దాచుకోవడానికే నాయిని రాజేందర్ రెడ్డి అమెరికా, ఆస్ట్రేలియా పోయారని ఆరోపించారు. 8 నెలల్లో రాజేందర్ రెడ్డి, ఆయన అనుచరుల అరాచకాలు ఎక్కువయ్యాయని దాస్యం మండిపడ్డారు. నీ చేతిలో ఉన్న అధికారాన్ని మంచి పనులకు ఉపయోగించు అని హితవు పలికారు. వేల కోట్లతో వరంగల్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. దమ్ముంటే రాజేందర్ రెడ్డి తనతో అభివృద్ధిలో పోటీ పడాలని సవాలు విసిరారు.
వైఎస్ఆర్, కిరణ్‌కుమార్ రెడ్డి లాంటి వాళ్లకే తన తెలంగాణ వాదాన్ని చూపించానని దాస్యం అన్నారు. అసెంబ్లీలోనే నల్ల జెండాలు ఎగురవేశానని గుర్తుచేశారు. నాలాల మీద ఉన్న పెద్దల భవనాలు కనిపిస్తలేవా.. పేదల డబ్బాలే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపైనే తన పోరాటమని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పారు. వరంగల్‌లో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ గూండాల దాడిని దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ఆసరా పెన్షన్లు రూ.4000 చేస్తమన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మాపై దాడి జరిగితే, మమ్మల్నే అరెస్టు చేశారని అన్నారు.