హైదరాబాద్, జులై 11 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డిని చంద్రభూతంగానే తెలంగాణ సమాజం గుర్తిస్తుందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రైతులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట గొట్టేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్దారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ , టీడీపీ పాలనలో కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను తీర్చి, నాణ్యమైన నిరంతర ఉచిత కరెంట్‌ను అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నదని మండిపడ్డారు. వెలుగుతున్న రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందనడానికి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. రేవంత్‌రెడ్డికి రైతులంటే మొదటి నుంచి చిన్నచూపేనని, ధరణి రద్దు చేస్తామని ఇటీవలే చెప్పిన రేవంత్.. తాజాగా ఉచిత కరెంట్‌ను రద్దు చేస్తామని ప్రకటించి తన అగ్రవర్ణ ఆధిపత్య సంస్కృతిని చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను చంద్రబాబు ఏజెంట్‌నని గతంలో ప్రకటించిన రేవంత్, తెలంగాణకు చంద్రభూతంలా మారాడని నిప్పులు చెరిగారు. బ్లాక్ మెయిల్ చేసి బతికే రేవంత్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలుసని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి, కానీ రైతుల తమ పంట పొలాలకు ఉండొద్దా? అని ప్రశ్నించారు. 3 గంటల్లో మూడు ఎకరాల్లో నీరు పారుతాయని నిరూపిస్తే తాను ముక్కునేలకు రాస్తానని, అలా నిరూపించకుంటే పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఉచిత కరెంట్, ధరణి విషయంలో కాంగ్రెస్ విధానం ఏమిటో చెప్పాలని నిలదీశారు. రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎకడ కూడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వారి అభివృధ్ధికి కృషి చేస్తుంటే, రేవంత్ వారిపై తన అక్కసును వెల్లగక్కుతున్నారని విరుచుకుపడ్డారు.
కరువు పీడిత ప్రాంతాల పాపం కాంగ్రెస్‌దే: నిరంజన్‌రెడ్డి
కాంగ్రెస్ తీరు తో ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ 9 జిల్లాలు శాశ్వత కరువు పీడిత ప్రాం తాలుగా మారాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సాగునీరు, కరెంటు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి కరువుకు నిలయంగా, వలసలకు మారుపేరుగా చేసింది కాంగ్రెస్ పాలన అని ధ్వజమెత్తారు. ఉచిత కరెం టు వద్దనడం రైతులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఒక్క ఎకరా కూడా బీడు లేకుండా సాగునీరు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా ఇస్తుంటే.. సాగుకు ఉచిత విద్యుత్తు తొలగిస్తామని రేవంత్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.