హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ‘న్యాయం, ధర్మం గురించి చెప్పాల్సిన పవిత్రమైన అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కోర్టుల్లో ఉన్న కేసులపై అసెంబ్లీలో అసత్యాలు వల్లించి రాజ్యాంగ హననానికి పాల్పడ్డారు..’ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, ఫయాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతు సమస్యలు, హైడ్రా, మూసీ బాధితుల ఇక్కట్లను పక్కనబెట్టి రోతమాటలు, పిచ్చికూతలతో విచిత్ర విన్యాసాలు చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా కోర్టుల్లో ఉన్న అల్లు అర్జున్, లగచర్ల కేసుల్లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని మండిపడ్డారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ను బాధ్యుడిని చేసిన ముఖ్యమంత్రి.. హోమంత్రిగా తన బాధ్యతలను నుంచి తప్పించుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సినీ నటుడి భుజంపై తుపాకీ పెట్టి సినీ ఇండస్ట్రీని లొంగదీసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రేవతి మృతిపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రి ఆమె కుటుంబానికి ఒక్క పైసా పరిహారమిచ్చారా? అని నిలదీశారు. కనీసం హోంమంత్రిగానైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? అంటూ ప్రశ్నించారు. పుష్ప సినిమాలో హీరో ఎలా నటించారో తెలియదు కానీ, అసెంబ్లీలో మాత్రం సీఎం అంతకంటే అద్భుతంగా నటించారని ఎద్దేవా చేశారు. ఫార్ములా-ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడితే కోర్టులో ఉన్నదని తప్పించుకున్న ఆయన కోర్టుల్లో విచారణ కొనసాగుతున్న లగచర్ల, సంధ్య థియేటర్ తొక్కిలాసటపై ఎలా మాట్లాడారని నిలదీశారు.
ఓటేసి గెలిపించిన వారికి అవమానం..
సుఫారీ తీసుకొని కలెక్టర్‌పై దాడి చేశారని చివరకు తనకు ఓటేసి గెలిపించిని లగచర్ల గిరిజన రైతులను అసెంబ్లీలోనే అవమానించిన ఘనుడని మండిపడ్డారు. పాలన చేతగాక ప్రశ్నించిన ప్రతిపక్షాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎన్ని కేసులు పెట్టినా సర్కారు దమనకాండను బీఆర్ఎస్ ఎండగడుతుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటపడుతుందని తేల్చిచెప్పారు.