Revanth Reddy | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీకి కోవర్టుగా మారారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించటానికే ఆయన పీసీసీ అధ్యక్షుడయ్యారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా ఉంటూ.. కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్.. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలువటంపై రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను శ్రవణ్ తిప్పికొట్టారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులను తెచ్చేందుకే కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశమయ్యారని స్పష్టంచేశారు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని దొంగచాటుగా ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్తే.. ఇక్కడ గల్లీలో రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని స్వాగతించకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మెట్రోకు నిధుల కోసం, జిల్లాల అభివృద్ధి కోసం, ధాన్యం సేకరణ పెంచాలని కోరేందుకు సంబంధిత కేంద్ర మంత్రిని కేటీఆర్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ‘మీ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంలు, మంత్రులు ప్రధానిని ఎందుకు కలిశారో చెప్పు. సిగ్గులేకుండా, బుద్ధి గడ్డి తిన్నట్టు మాట్లాడొద్దు. నీ ప్రవర్తన చూస్తే.. శునకాన్ని తీసుకెళ్లి కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినట్టు ఉన్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు తొత్తుగా, బీజేపీ కోవర్టుగా రేవంత్‌రెడ్డి, సునీల్ కనుగోలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసిన ప్రతిచోటా కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తుచేశారు. ఆయన ఓట్లను బీజేపీకి వేయిస్తూ.. కాంగ్రెస్ గొంతు పిసుకుతున్న విధానాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. చంద్రబాబు ఆంధ్రాకు వెళ్లిపోతూ తెలంగాణలో టీడీపీని తనకు అప్పగించి వెళ్లారని రేవంత్ గతంలో చెప్పుకోలేదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన పలువురు కాంగ్రెస్ సీఎంలు, మంత్రుల ఫొటోలను ప్రదర్శించారు.
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తదన్నట్టు.. బ్లాక్ మెయిల్ రేవంత్ కండ్లకు అంతా అలాగే కనిస్తున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని అన్నారు. రాష్ర్టానికి రావల్సిన నిధుల కోసం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్‌పై నిందలు వేయడం రేవంత్ వక్రబుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్ ఒక ఎంపీగా ఉండి.. రాష్ర్టానికి ఒక్క పైసా నిధులు తేకపోగా, హక్కుగా రావాల్సిన నిధులను అడిగేందుకు వెళ్లిన కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రేవంత్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బ్లాక్‌మెయిలర్ రేవంత్‌ను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రాకతోనే కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ కాంగ్రెస్‌గా మారిందని, త్వరలోనే అది రెడ్డి కాంగ్రెస్‌గా మారబోతున్నదని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎల్ రూప్సింగ్, కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.