హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు చేశారని, ఇంకెన్ని సార్లు చేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప.. పేదలకు పథకాలు అందించే ఉద్దేశం లేదని మండిపడ్డారు. 14 నెలల పాలనలో పెంచుతామన్న ఫించన్లు పెంచలేదని, ఇస్తామన్న రేషన్‌కార్డులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శనివారం తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు వెంకటేశ్వర్లు, కిశోర్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అభయహస్తం కింద రేషన్‌కార్డులతోపాటు ఐదు పథకాల అమలుకోసం 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు దరఖాస్తులు తీసుకున్నారని, గ్రామసభల్లో మరోసారి అర్జీలు పెట్టుకున్నారని, మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలు ఇంకోసారి దరఖాస్తు చేసుకున్నట్టు గుర్తుచేశారు.
మూడుసార్లు దరఖాస్తు చేసినా ఒక్క రేషన్‌కార్డు ఇవ్వని రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో రూ.50 వసూలు చేస్తూ మళ్లీ దరఖాస్తులు తీసుకోవడం ఏంటని ఫైరయ్యారు. రేషన్‌కార్డులు ఇప్పిస్తామని కొందరు దళారులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా 6.47 లక్షల రేషన్ కార్డులు జారీచేశారని, ఈ విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డే అసెంబ్లీలో స్వయం గా చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుచేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని హెచ్చరించారు.