హైదరాబాద్ జూలై 7 (నమస్తే తెలంగాణ): కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. వాస్తవాలు మాట్లాడిన హరీశ్‌రావుపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య, రాజేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవంతో, నీళ్ల వినియోగంపై అవగాహనతో హరీశ్‌రావు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వస్తున్న వరద నీళ్లు వాడుకోవాలని, మేడిగడ్డను రిపేర్ చేయించాలని, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఆన్ చేయాలని చెప్తే కాంగ్రెస్ నేతలు మాత్రం అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘హరీశ్‌రావు.. కల్వకుర్తి లిఫ్ట్‌లు ప్రారంభించి నీళ్లివ్వాలని అడగడం తప్పా? శ్రీశైలానికి 35 రోజులుగా వస్తున్న వరదనీటిని వాడుకోవాలనడం తప్పా?’ అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. పొతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోతుంటే రేవంత్ సర్కారు చోద్యం చూస్తూ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు న్యాయం జరిగిందని లక్ష్మారెడ్డి వివరించారు. ఉమ్మడి జిల్లాలో 2014కు ముందు రెండు లక్షల ఎకరాలకే సాగునీరు అందేదని, కానీ, బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఏడు లక్షల ఎకరాలు, చెక్‌డ్యాంలు, చెరువుల ద్వారా మరో మూడు లక్షల ఎకరాలు మొత్తంగా 10 లక్షల ఎకరాలకు నీరందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తూర్పారబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలకు పాపం చుట్టుకున్నదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తన స్థాయి మరిచి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి మహబూబ్‌నగర్‌కు నీళ్లిచ్చిన హరీశ్‌రావుపై విమర్శలు చేసే స్థాయి మధుసూదన్‌రెడ్డికి ఎక్కడిదని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల కాళ్లు విరగ్గొట్టి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బూతులు మాట్లాడుతున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విమర్శించారు. గద్దెనెక్కిన వెంటనే పాలమూరు-ఎత్తిపోతలకు జైపాల్‌రెడ్డి పేరుపెట్టి ఏడాదిలోపే నీళ్లిస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదిన్నరలో నిత్యం కేసీఆర్ జపం చేయడం తప్ప సాధించిందేమీలేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అబద్ధాలు మాట్లాడటంలో పోటీపడుతున్నారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రంగినేని అభిలాష్, హనుమంత్ నాయక్ పాల్గొన్నారు.