Bhukya Johnson Naik | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జాన్సన్ నాయక్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు ఇక్కట్ల పాల్జేస్తున్నడని మండిపడ్డారు. రాష్ర్టంలో ఆ పార్టీ నుంచి అనేక మంది గిరిజన బిడ్డలు ఎమ్మెల్యేలు గెలిచారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం గిరిజన మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి వద్దే పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హామీల ఊసెత్తకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ రోజులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఇప్పటికైనా గాలిమాటలు మాని పథకాల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.