పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో బీరం హర్షవర్దన్ రెడ్డి ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం బీఆర్ఎస్లోనే కొనసాగుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాని అన్నారు.
అంతకుముందు నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తన చివరి శ్వాస వరకు కూడా.. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని తెలిపారు. నా పార్టీ కార్యకర్తల కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని అన్నారు.