Banda Prakash | దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే హిల్ట్ పి పాలసీ తీసుకొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బండ ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పరిశ్రమల స్థాపనకు టీఎస్ఐపాస్ తెచ్చి 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూ దందా కోసమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చిందని ఆరోపించారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేటప్పుడే కాదు.. అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. పర్యావరణవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సోషల్ ఇంపాక్ట్ స్టడీస్ చేయాలనన్నారు.
లీజు భూములకు హిల్ట్ పాలసీ వర్తించదని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని బండ ప్రకాశ్ తెలిపారు. మరి జీవోలో మాత్రం 9 వేల ఎకరాలకు పైనే ఎలా ప్రస్తావించారని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి జీవోలు ఎపుడూ ఇవ్వలేదని.. పారదర్శకమైన విధానం అమలు చేశామని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంతో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ బాధ్యత
అని అన్నారు. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్ల అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలు స్థాపించే అవకాశం పారిశ్రామికవేత్తలకు కల్పించాలని సూచించారు. బిడ్డింగ్ ద్వారా ఉపయోగంలో లేని పరిశ్రమల భూములను అమ్మాలని.. చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలు అవుతోందని తెలిపారు.
హిల్ట్ పాలసీ రావడం వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని బండ ప్రకాశ్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ లో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని తెలిపారు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదని అన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా కొత్తగా ఎన్నో పరిశ్రమలు తెచ్చి పదేళ్ల కేసీఆర్ పాలనలో 18 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. హిల్ట్ పాలసీ రద్దు చేసి పారిశ్రామిక భూములు వేలం వేయాలని డిమాండ్ చేశారు. హిల్ట్ కు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళతామని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల పర్యటనకు 8 నిజనిర్ధారణ బృందాలను పార్టీ నియమించిందని తెలిపారు.
కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రులు ఈ బృందాలకు నేతృత్వం వహించి వేర్వేరు క్లస్టర్లలో పర్యటిస్తారని పేర్కొన్నారు. 8 క్లస్టర్లలో మా నేతల బృందం రేపు, ఎల్లుండి పర్యటించి నిజాలు నిర్ధారించడంతో పాటు భూముల ధరలు నిర్ధారిస్తుందని తెలిపారు. బీజేపీ నేతలు కూడా ఆలస్యంగానైనా హిల్ట్ పై మేల్కొన్నందుకు సంతోషమన్నారు. 5 లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణంపై గవర్నర్ కూడా స్పందించాలన్నారు. పర్యావరణవేత్తలు కూడా స్పందించాలని.. మా నిజనిర్దారణ బృందాల పర్యటనల్లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిలువు దోపిడీని అరికట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం భూములను కారు చౌకగా కట్టబెడితే పేదల ఇండ్లకు, ఆస్పత్రులకు, పార్కులకు, స్మశాన వాటికలకు భూములు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు.