BRS Party | దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చినాక మంచిపై చెడు విజయం సాధిస్తున్నట్టుగా ఉందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో చీకట్లే కనిపిస్తున్నాయని.. నాడు కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు గొడుగులు పట్టీ మరీ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు గన్లు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయన్నారు. దళిత మంత్రిని పట్టుకొని సహచర మంత్రులు ఏ విధంగా మాట్లాడారో చూశామని.. జూబ్లీహిల్స్‌లో ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్ అమలు చేశారో లేదో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఫ్యూడలిస్టు ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని.. బీజేపీతో కలిసిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు. సదర్ ఉత్సవాల్లో బీజేపీ నాయకులతో వేదికలు పంచుకుంది రేవంత్ రెడ్డేనని.. అనేక వేదికల్లో బీజేపీ నేతలతో కలిసి రేవంత్ పాలుపంచుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి జీన్స్‌లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని.. తనది ఆర్ఎస్ఎస్ స్కూల్ అని రేవంత్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. రెవంత్ను కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సీఎంగా బీజేపీ నేతలు బీజేపీ సీఎంగా భావిస్తున్నారని.. రేవంత్ బీజేపీ వేర్వేరు కాదని.. రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసే పని చేస్తున్నాయన్నారు.
తన సొంత లోక్ సభ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లో, తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిలో బీజేపీని గెలిపించింది రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. బీజేపీ సీఎంల కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని.. బీజేపీ ఎంపీలు రేవంత్‌పై ఈగ వాలనీయడం లేదని.. బడేభాయ్ చోటే భాయ్ లాగా రాష్ట్రం లో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. బీజేపీ బీ ఆర్ ఎస్ లు కలిసి ఉన్నాయని సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మరన్నారు. సమావేశంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామమూర్తి, కురువ విజయ్ కుమార్, కట్ల స్వామి యాదవ్ పాల్గొన్నారు.