Balka Suman | రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రేరేపిత ఉదేశ్యంతోనే చత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీపై విద్వేషంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బాల్క సుమన్ విమర్శించారు. ఏ శాఖలో కూడా పరిపాలన సరిగా సాగడం లేదన్నారు. విద్యా శాఖలో గందరగోళమైన పరిస్థితి ఉందన్నారు. విద్యా శాఖకు మంత్రి కూడా లేరని పేర్కొన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయంలోనూ ఆ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని పాఠ్య పుస్తకాలను వెనక్కి తెప్పించడాన్ని బాల్క సుమన్ తప్పుబట్టారు. తమిళనాడులో స్కూల్ బ్యాగులపై జయలలిత ఫోటోలు ఉన్నా సరే సీఎం స్టాలిన్ వాటిని విద్యార్థులకు పంచాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి ఇంత వరకు ఆ శాఖపై సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సీఎం సొంత జిల్లాలోనే పట్ట పగలు ఒక వ్యక్తిని కొట్టి చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గరే హోం శాఖ ఉందని, రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని విమర్శంచారు. పట్టపగలు దోపిడీలు జరుగుతున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఆశా వరర్లకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో రేవంత్ రెడ్డి ఉన్నారని, కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్ కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిన ఆనవాళ్లు, వాటిని లేకుండా రేవంత్ రెడ్డి చేస్తారా అంటూ సుమన్ నిలదీశారు. ఇలా అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ ముఖ్యమంత్రి అంటూ బాల్క సుమన్ అభివర్ణించారు.