Balka Suman | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని, విద్యార్థులను ఉగ్రవాదులా మాదిరి పోలీసులు వెంటాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేరుకే ప్రజా పాలన.. కానీ దగా పాలన నడుస్తోంది. గురుకులాలు, యనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. అరణ్య రోదన అయిపోయింది. సుల్తాన్పూర్ జెఎన్టీయూలో చట్నీలో చిట్టెలుక వచ్చింది. కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడింది. భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో 20 మంది దాకా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అని బాల్క సుమన్ గుర్తు చేశారు.
గురుకులాల వల్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతూ.. వాటిని ఎత్తేయాలనే ఉద్దేశంతో రేవంత్ ఉన్నారు. రెండు నెలలుగా రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలు లేరు. నిర్లక్ష్యంగా యూనివర్సిటీలను వదిలేశారు. యూనివర్సిటీల్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోవడం లేదు. గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:100 పిలవాలి. 2 లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్, గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వేల పోస్టులను అదనంగా పెంచాలి. నిరుద్యోగ భృతి 4 వేలు ఇస్తామని చెప్పారు.. ఈ డిమాండ్ల కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే కావాలని కరెంట్ తీసేయడం, నీళ్లను బంద్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో ఎలాగైతే ఇనుప కంచెలతో ఉక్కుపాదం మోపారో.. మళ్లీ ఆ పరిస్థితులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు అని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు.
ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు దుర్మార్గంగా చొరబడి నిరుద్యోగులను, విద్యార్థులను ఉగ్రవాదుల్లాగా వెంటాడారు. యూనివర్సిటీలు రేవంత్ నాయకత్వంలో అన్యాయానికి గురవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఒక రకమైన బెదిరంపు ధోరణితో మాట్లాడుతున్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో డీఎస్సీ అభ్యర్థుల న్యూసప్ కవరేజ్‌కు వెళ్లిన జీ తెలుగు రిపోర్టర్‌ను చొక్కా పట్టుకుని వ్యాన్‌లో ఎక్కించారు. విద్యార్థుల నిరసనలు డిలీట్ చేయాలని బెదిరించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తూ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసనలు తెలిపితే పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు. చివరకు మీడియా గొంతు కూడా నొక్కాడు. ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా దమనకాండ ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రజా పాలన కాదు.. దగా పాలన.. దమనకాండ పాలన. సమైక్య పాలనను మించిన పాలన తెలంగాణలో కొనసాగుతోందని బాల్క సుమన్ ధ్వజమెత్తారు.