మంచిర్యాల, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో బడేభాయ్ మోదీ డైరెక్షన్లో తెలంగాణలో చోటేభాయ్ రేవంత్‌రెడ్డి యాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కండ్లలో సంతోషం చూడటానికి సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రాకు వదిలిపెడుతున్నారని ఆరోపించారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి మన నీళ్లను ఏపీకి ఎత్తుకుపోతుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు. గోదావరి, ప్రాణహిత నీళ్లను ఏపీకి తరలించేందుకే మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయడంలేదని మండిపడ్డారు. బడాభాయ్, చోటాభాయ్ ఇద్దరూ ఆంధ్రాభాయ్ చంద్రబాబుతో కలిసి తెలంగాణను నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కేసీఆర్, బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సోమవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగితే ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ)ని విచారణకు పంపిన మోదీ సర్కార్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి 8 మంది చనిపోతే ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలోని బీజేపీ లీడర్లకు కాంగ్రెస్ సర్కార్ ఆగడాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డపై అసత్య ప్రచారం చేసి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ బోల్తా కొట్టించాయన్నారు. లగచర్చ భూములు గుంజుకునేందుకు లంబాడాలను చిత్రహింసలు పెట్టారని, హెచ్‌సీయూలో 400 ఎకరాలు కబ్జా చేసేందుకు విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేశారని మండిపడ్డారు. వీటన్నింటిపై బీఆర్ఎస్ చేసిన పోరాటంతోనే సర్కార్ వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణలో మరోపోరాటం బీఆర్ఎస్ రజతోత్సవ సభతో మొదలవుతుందని చెప్పారు. జిల్లాలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.