మంచిర్యాల : మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు అదే పంథాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బెదిరింపులు, దాడులకు పాల్పడుతూ కైవసం చేసుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి ( Kyathanpally ) లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నిక జరుగకుండా అడుగడుగునా పోలీసుల సహకారంతో అడ్డుకుంటు న్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
గత రెండు రోజులుగా బాల్క సుమన్ ఇంటిని ముట్టడించిన పోలీసులు ఇవాళ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో బాల్కసుమన్కు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ఎట్లైనా చేజిక్కించుకోవాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.
తమపై కాంగ్రెస్ నాయకులు రాళ్ళు రువ్వడమే కాకుండా పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసి, మళ్లీ కేసులు కూడా తమ మీదే పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా కొంత మంది పోలీసులు మంత్రి వివేక్ కు ఊడిగం చేస్తున్నారని, ఈ అక్రమ కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.