Badugula Lingaiah Yadav | సూర్యాపేట : జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని, బిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల పాటు ఉద్యమం నడిపి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావు అంచులకు కేసీఆర్ వెళితే 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. సాధించుకున్న ప్రత్యేక తెలంగాణను ఎలాగైనా అభివృద్ధి పథంలో ఉంచాలని పదేళ్ల పాటు కేసీఆర్ శ్రమించి అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాడన్నారు. నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పరిస్థితులు, బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధితో పాటు ఇతర కార్యక్రమాలపై మాట్లాడుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ వేడుకల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.