పాన్‌గల్, నవంబర్ 11 : కాంగ్రెస్ నాయకుల దాడి.. పోలీసుల వేధింపులు భరించలేక బీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాబునాయక్ ఇంటి స్థలం విషయంలో పక్కింట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుచరుల మధ్య వివాదం నెలకొన్నది.
ఈ క్రమంలో ఈ నెల 7న అధికార పార్టీ నాయకుడి అనుచరులైన బాలునాయక్, రాజునాయక్, భాస్కర్నాయక్తోపాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకుడు బాబునాయక్ ఇంట్లోకి చొరబడి దాడిచేశారు. ఈ విషయాన్ని 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోలేదు. కేసు కూడా నమోదు చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం బాబునాయక్, అతడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొన్నారు.
కేసు విషయమై ఎస్సైని అడగ్గా ఆయన దుర్భాషలాడటంతోపాటు రౌడీషీట్ ఓపెన్ చేస్తానని హెచ్చరించారంటూ బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన బాబునాయక్ తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి జిల్లా దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ ఎస్టీ సెల్ నాయకులు అతడిని పరామర్శించారు.