Anugula Rakesh Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని నమ్మించి జాబ్‌లెస్ క్యాలెండర్ ఇచ్చిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. గత జాబ్‌లెస్ క్యాలెండర్లో పండుగలు, పబ్బాలు, పంచాంగాలు తప్పా ఎక్కడా ఉద్యోగ నియామకాల ఊసే రాలేదని ఎద్దేవా చేశారు. మైసూరు బజ్జీలో మైసూర్ లేకున్నా కనీసం బజ్జీ ఉంటుందని.. బొంబాయి రవ్వలో బొంబాయి లేకున్నా రవ్వ అయినా ఉంటుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో జాబు లేదు.. క్యాలెండర్ లేదని సెటైర్ వేశారు.
2024 సంవత్సర క్యాలండర్ పూర్తి అయింది.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాత్రం పూర్తి కాలేదని.. ఆచరణలో పెట్టలేదని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. 2024 క్యాలండర్ ప్రకారం జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో మహాశివరాత్రి, మార్చిలో హోళీ, ఏప్రిల్‌లో ఉగాది, జూలైలో మొహర్రం, ఆగస్టులో రాఖీ, సెప్టెంబర్ వినాయక చవితి, అక్టోబర్‌లో దసరా, నవంబర్‌లో దీపావళి, డిసెంబర్లో క్రిస్మస్ వచ్చిందని అన్నారు. కానీ, ఈ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు మాత్రం రాలేదని చెప్పారు. పండుగలు, పబ్బాలు, పంచాంగాలతో గత క్యాలెండర్ నిండిపోయిందని తెలిపారు. ఈ 2025 క్యాలెండర్ ప్రస్తుతం ఖాళీగా ఉంది.. అంటే ఈ ఏడాది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, టీజీపీఎస్సీ కలిసి జాబ్ క్యాలెండర్ అని పండుగలు, పబ్బాలే ఇస్తారో చెప్పాలని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకుంటుందని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. కానీ మీ పండుగ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఎండ్‌గా మారుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదైనా జాబ్ క్యాలెండర్లో పండగలతో పాటు కొన్ని జాబ్‌లు కూడా ప్రకటించాలని సూచించారు. కొత్త క్యాలెండర్ రాగానే, యూపీఎస్సీ తన జాబ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తమ రాజకీయ గురువు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తానని ప్రతిజ్ఞ చేశారని గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్ రరెడ్డి ఆ విషయం మరిచిపోయినట్లు ఉన్నాడని అన్నారు. ఏపీలో చంద్రబాబు ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడని తెలిపారు. మీరెప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రంలో తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రానికి ఆ సోయి ఎందుకు లేదని ప్రశ్నించారు. యూపీఎస్సీ, తమిళనాడు, బిహార్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇచ్చే జాబ్ క్యాలెండర్లో తేదీలతో సహా ఉంటాయని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్‌గా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు వేశామని పెద్ద పెద్ద హోర్డింగ్‌లు కట్టి డబ్బా కొట్టుకున్నారని గుర్తుచేశారు. మంది పెళ్లిళ్లకు మంగళహారతి పట్టడంలో రేవంత్ రెడ్డి ముందుంటాడని ఎద్దేవా చేశారు.