Rakesh Reddy | హైదరాబాద్ : మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే దాడి జరిగింది అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అద్దం పడుతుంది అని మండిపడ్డారు.
భద్రాద్రి రాముడున్న భద్రాద్రి కొత్తగూడెంను కాంగ్రెస్ రాజ్యం రావణ కష్టంగా మారుస్తుంది. ఆ సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే హత్య చేసేవారే. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను, కొత్తగూడెంను కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలకు, అరాచకాలకు అడ్డా చేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు ముగ్గురు మంత్రులు ఖమ్మంను మూడు ముక్కలాట ఆడుతూ, ఆగం పట్టిస్తున్నారు అని ధ్వజమెత్తారు.
10 ఏళ్లు పచ్చగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను రక్త శిక్తం చేయడమే ప్రజా పాలన లక్ష్యమా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ ఆఫీసు మీద దాడి చేయొచ్చు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం జిల్లా ప్రజలు ఉరికించి కొడతారు. నిజంగా ఈ దాడి ప్రభుత్వ కనుసన్నల్లో జరగకపోతే తక్షణమే దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి జైల్లో వేయాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా దాడిలో పాల్గొన్న వారిని కనీసం 2 ఏళ్లు నగర బహిష్కరణ చేయాలి అని ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.