హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం పక్కా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేత దాసోజు శ్రవణ్‌తో కలిసి బుధవారం మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో పలు విషయాలు పంచుకున్నారు. బీసీ వర్గాలపై సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి మానవీయ దృక్పథం ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతున్న కులగణనను సీఎం కేసీఆర్ ఎప్పుడో పూర్తిచేశారని తెలిపారు.
కాంగ్రెస్ గెలుపు అసాధ్యం
1983 నుంచి ఇప్పటి వరకు గడిచిన నలభై ఏండ్లలో చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నాయకుల కాలంలోనూ కాంగ్రెస్‌కు తెలంగాణలోని మొత్తం సీట్లలో 50 శాతం ఎన్నడూ రాలేదని పొన్నాల గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ 50శాతానికిపైగా సీట్లతో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో తొలి నుంచీ బీసీలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. గతంలో పీసీసీ చీఫ్లుగా పనిచేసిన ముగ్గురు బీసీ నేతలు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. బీసీలకు అనేక పదవులు ఇచ్చి సముచిత ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు బీసీలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ మూడోసారీ సీఎం అవుతారని, ఇందులో అనుమానం లేదని పొన్నాల స్పష్టం చేశారు.