హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసపూరిత పాలనపై బీఆర్ఎస్ కదనభేరి మోగించనున్నది. అలవికాని హామీలిచ్చి అమలుచేయకుండా దగా చేసిన సర్కార్‌పై పోరుబాటకు సిద్ధమైంది. అందులో భాగంగా సెప్టెంబర్ 1న ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌తో మొదలు 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నది. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను గురువారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మోసపూరిత రేవంత్ సర్కార్ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి మహమూ ద్ అలీ, విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, వై సతీశ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ నేత కిశోర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇది తెలంగాణ ప్రజల సర్కార్ కాదు.. ముమ్మాటికీ ఆంధ్రా ప్రయోజనాలకు కొమ్ముకాసే బానిస సర్కార్’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్ర జాపాలన పేరిట దగాపాలన చేస్తున్నదని దు య్యబట్టారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అమలుచేస్తామని గ్యారెంటీ కార్డులు పంచి న కాంగ్రెస్, వెయ్యి రోజులైనా అమలు చేయకుండా దారుణంగా వంచిస్తున్నదని మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రి యాంకగాంధీ, మల్లికార్డున ఖర్గేను తీసుకువచ్చి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల పేరిట హామీలిచ్చిన విషయాన్ని గు ర్తుచేశారు. కానీ సెప్టెంబర్ 2న నాటికి వెయ్యి రోజులు పూర్తయినా అమల్లో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ‘హామీలు అమలు చేయలేదని మేధావులు, ఆర్థికవేత్తలు, జర్నలిస్టులు ప్రశ్ని స్తే.. మాది వందేండ్ల పార్టీ అని, అపార అనుభవం ఉన్నదని రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క గొప్పలు చెప్పారు.. ఇదిగో గ్యారెంటీ కార్డు’ అని ప్రగల్భాలు పలికారంటూ నిప్పలు చెరిగారు. ఇప్పుడేమో అప్పులు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాకులు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
దేవుళ్లపై ఒట్లు పెట్టి మోసం
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు పెట్టి హామీలిచ్చి ఓట్లేయించుకున్న రేవంత్‌రెడ్డి.. గద్దెనెక్కిన తర్వాత దారుణంగా వంచిస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను, ఎలక్ట్రిక్ స్కూటీలు అందించకుండా ఆడబిడ్డలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలివ్వాలని అడిగిన నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమంటూ ధ్వజమెత్తారు. కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ సర్కార్ అని విమర్శించారు.
గోదావరి, కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వంతో రేవంత్ సర్కార్ చీకటి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నదని తూర్పారబట్టారు. ఆటోడ్రైవర్లు, ఉద్యోగులకు కూడా ధోకా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశంలోనూ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడం లేదని విమర్శించారు. ఎన్నో త్యాగాలు చేసి, రెండు తరాల జీవితాలను కోల్పోయి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలను కాంగ్రెస్ సర్కార్ దారుణంగా వంచిస్తున్నదని దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ పాలనలో ఒక క్రమపద్ధతిలో ముందుకుసాగుతున్న తరుణంలో.. కాంగ్రెస్ ఆకాశమంత అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించిన ఘనత భారతదేశ చరిత్రలో ఎక్కడా జరుగలేదని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్‌కు రండి
నాడు ఏటా 2లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన రాహుల్‌గాంధీ ఇప్పుడు పత్తాలేకుండా పోయారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. దేశమంతా తిరుగుతూ ఉపన్యాసాలిస్తున్న ఆయన దమ్ముంటే అశోక్నగర్కో, ఉస్మానియా యూనివర్సిటీకో రావాలని డిమాండ్ చేశారు. దేశంలో ఒకతీరు.. వారి పాలనలోని రాష్ట్రంలో మరోతీరుగా వ్యవహరించడం ద్వంద్వ నీతి కాదా? అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు వెయ్యి రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. ఇకపై ఊరుకోబోమని అసెంబ్లీ లోపల, ప్రజాక్షేత్రంలో నాలుగుకోట్ల ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నిరసనల షెడ్యూల్ ఇదీ..
సెప్టెంబర్ 1: అలవికాని హామీలిచ్చి వెయ్యి రోజులైనా అమలుచేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై సెప్టెంబర్ 1న చార్జ్‌షీట్ వేస్త్తామని సింగిరెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల నిరసన కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
సెప్టెంబర్ 2: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ, 420 మీటర్ల ఫ్లెక్సీల ప్రదర్శన.
సెప్టెంబర్ 3: వ్యవసాయరంగం విధ్వంసం, 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టిన వ్యవసాయ భూములు, విద్యుత్, సాగునీరు, యూరియా, ఎరువులు, రైతుబీమా, రైతుబంధుపై గ్రామీణ ప్రాంతాల్లో రైతు సదస్సులు, హైదరాబాద్‌లో ధర్నాలు.
సెప్టెంబర్ 4 : మహిళలకు రూ.2,500, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల ఎగవేత, దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వాన్ని వంటావార్పు ద్వారా ఎండగడుతాం.
సెప్టెంబర్ 5: విద్యార్థులు, యువత జాబ్ క్యాలెండర్ అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ యూత్ డిక్లరేషన్ అమలు కోసం యువత, విద్యార్థులతో ర్యాలీలు, ఆదిలాబాద్, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంత 12 నియోజకవర్గాల్లో ప్రత్యేక నిరసనలు.
సెప్టెంబర్ 6: హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీలు. తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానల సాధనకు నిరసనలు, మిగతా నియోజకవర్గాల్లో తాగునీరు. వీధి దీపాలు, పడకేసిన పారిశుధ్యంపై నిరసన.
సెప్టెంబర్ 7: ప్రజావాణిలో భాగంగా అన్ని జిల్లా మరియు మండల ప్రజావాణి కేంద్రాలలో 420 హామీల అమలుపై సామూహిక వినతిపత్రాల సమర్పణ.
సెప్టెంబర్ 8: జిల్లాకేంద్రాల్లో ఏడు రోజుల కార్యక్రమాలపై ప్రెస్మీట్ల నిర్వహణ, అంబేదర్ విగ్రహాలకు వినతిపత్రాలు.
సెప్టెంబర్ 9: ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం.