కొత్తపల్లి, జూన్ 28 : సాగునీటి కోసం బీఆర్ఎస్ సమరం మొదలైంది. నాడు కేసీఆర్ పాలనలో ఏడాది పొడవునా కళకళలాడుతూ.. చివరి భూముల వరకు నీళ్లందించిన వరదకాలువ.. నేడు వట్టిపోవడంతో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆగ్రహిస్తూ నిరసనలకు దిగుతున్నది. సీజన్ మొదలై నెల గడుస్తున్నా.. నారు మడులు ముదురుతున్నా నీళ్లివ్వకపోవడంపై భగ్గుమంటున్నది. కాళేశ్వరం నీటితో ప్రాజెక్టులను నింపి నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నది. ఈ మేరకు శనివారం కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్‌లో క్రికెట్ ఆడి నిరసన తెలిపిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఆదివారం కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు వరదకాలువ నుంచి సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద రైతులు మహాధర్నా చేపట్టారు. రైతులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో వరద కాలువల ద్వారా కరీంనగర్ నియోజకవర్గంలోని గ్రామాలకు పుష్కలంగా సాగునీటిని అందించిన విధానాన్ని మాజీ మంత్రి గంగుల సభా వేదికపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు.
కాళేశ్వరం మోటర్లు మేమే ఆన్ చేస్తం: గంగుల
ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల మాట్లాడుతూ.. రైతులకు సాగు నీరిస్తరా? లేదా మేడిగడ్డ బాట పట్టమంటరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. మూడేండ్ల నుంచి వరద కాలువకు చుక్కనీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కండ్లు తెరువకపోతే మేడిగడ్డ వరకు రైతు మహాపాదయాత్ర నిర్వహించి, మోటర్లను ఆన్ చేస్తామని మరోసారి హెచ్చరించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన రైతే రాజుగా సాగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో యూరియా అందించిందని, ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రోహిణి కార్తె ముగిసి నెలరోజులవుతున్నా సాగునీటిని విడుదల చేయకపోవడంతో రైతులు వరి నారును సైతం వేసుకోలేదని, మరో పదిహేను రోజులు ఇలాగే ఉంటే పంటలు వేసినా వృథానేనని ఆందోళన వ్యక్తంచేశారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది నుంచి రోజూ సుమారు 10వేల క్యూసెక్కుల నీరు వృథాగా కిందికి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి నుంచి నీటిని కన్నెపల్లికి మళ్లిస్తే వరదకాలువ ద్వారా రైతులకు సాగునీటిని అందించవచ్చని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి మేడిగడ్డ వరకు పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. ఈ మహా ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.