KTR | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో కాంగ్రెస్ నాయకులు ప్రకటనలిచ్చిండ్రు. రాహుల్ గాంధీని అడుగుతున్న, నువ్వు ప్రామిస్ చేసిన రెండు లక్షల ఉద్యోగాలేవీ?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయని, మరి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఏవని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ వాళ్లు బయట కనబడితే నిరుద్యోగులు తన్నితరిమేసే పరిస్థితి ఉన్నదని దుయ్యబట్టారు. అందుకే నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చారని, అది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని ఆక్షేపించారు. జాబ్ క్యాలెండర్ నిజమైతే అందులో రెండు లక్షలు కాదు రెండు ఉద్యోగాలు కూడా ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్‌నగర్‌కు రావాలని, తామంతా అక్కడికి వస్తామని కేటీఆర్ వారికి సవాల్ విసిరారు.
అశోక్‌నగర్‌లో విద్యార్థులకు ఒక ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పినా తామంతా రాజీనామా చేస్తామని ప్రకటించారు. ‘మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకొంటున్నరు.. మేమిచ్చిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చినట్టు చెప్పుకొంటున్నరు. రేవంత్ మాట మాట్లాడితే నువ్వు మొగోడివైతే అంటడు.. మరి ఆయన మొగోడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలె’ అని కేటీఆర్ సవాల్ చేశారు. ‘అకడికి వస్తే విద్యార్థులే మిమ్మల్ని తన్నితరిమేస్తరు’ అంటూ కాంగ్రెస్ నేతలనుద్దేశించి ధ్వజమెత్తారు. నిన్నరాత్రి జీవో 46 ను సవరించాలని దిల్‌సుఖ్‌నగర్‌లో అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేశారని, అటు బిల్లుల కోసం 1800 మంది సర్పంచ్‌లు సచివాలయాన్ని ముట్టడిస్తే వారిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మార్పు, మార్పు అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘ఈ రేవంత్‌రెడ్డి ఎవరితో గోకోకూడదో వారితోనే గోకున్నారు.. కావాలనే నిరుద్యోగులను, యువతను రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిండ్రు. జాబ్ క్యాలెండర్ బోగస్, అందులో తారీఖులు తప్ప ఏమీ లేవు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్ క్యాలెండర్‌పై చర్చించాలని అడిగితే స్పీకర్ తమకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూప్ 1, 2, 3లో ఉద్యోగాల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారని, గ్రూప్- 1లో 1: 100 పిలవాలంటే తప్పించుకున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌పై చర్చిద్దామంటే తమ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేతో ఇష్టమొచ్చినట్టు తిట్టించారని మండిపడ్డారు. ‘ఆ ఎమ్మెల్యే బజారు భాషలో మాట్లాడారు. కోవా లక్ష్మి అక ఆ భాష వినలేక మనం ఇకడ ఉండొద్దు.. వెళ్లిపోదామని కోరారు’ అని ఆక్షేపించారు.
తెలంగాణ యువత తరఫున తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంత బజారు భాషలో తమను తిట్టిస్తారా అని ప్రశ్నించారు. ఇంత దిగజారుడు, దివాళా కోరు ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లను ఎకడికకడ నిలదీయాలని, ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అందరినీ ఉసిగొల్పుతూ బజారు భాష మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇలాంటి శాడిస్ట్ పనులు ఎకువ కాలం నడవవని, ఈ ఐదారు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఏమీ జరగలేదని అర్థమైపోయిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఒక శాడిస్ట్ అని, తమ ఆడబిడ్డలను, తమ ఎమ్మెల్యేలను తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇవాళ తెలంగాణ శానససభకు చీకటిరోజు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ విషయంలో సభలో తప్పుడు ప్రచారం చేశారని, రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు కూతలు కూశారని, ఈ రాష్ట్రం సంపద గల రాష్ట్రమని తాము లెకలతో చెప్పే సరికి చేసేదేం లేక సైలెంటయ్యారని చెప్పారు. తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించేలా రేవంత్‌రెడ్డి చిల్లర ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలను ఇకనైనా ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభలో దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీ మీద చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ ప్రాణాళిక ఏంటని తాము అడుగుదామనుకున్నామని చెప్పారు. స్పీకర్ తమకు చాలానీతులు చెప్పారని, దానం నాగేందర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని, దానంపై స్పీకర్ యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్‌రెడ్డి అన్నాడని, అసెంబ్లీ అంటే దేవాలయమని, అలాంటి దేవాలయంలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సబిత ఆవేదన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ శాసనసభలో రెండు రోజుల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానించేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, నిన్న మహిళలను అవమానించారని, ఈరోజు దానం నాగేందర్ అసభ్యకరంగా మాట్లాడారని చెప్పారు. రూ.25 కోట్లతో కేసీఆర్ జోడేఘాట్‌ను అభివృద్ధి చేసి చూపించారని, మెడికల్ కాలేజీలు పెట్టారని, జోడేఘాట్ గురించి అవగాహన లేకుండా ఎడ్మ బొజ్జు మాట్లాడుతున్నారని, నాలుగు లక్షల ఎకరాలకు పైగా అటవీ భూములకు బీఆర్ఎస్ పట్టాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘ఒక్క కేసీఆర్ కే ఫాంహౌస్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫాంహౌస్‌లు లేవా?’ అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పెద్ద బోగస్ అని విమర్శించారు. దానం నాగేందర్‌కు సిగ్గూశరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన కాంగ్రెస్, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలను కాంగ్రెస్ వచ్చాక తన ఖాతాలో వేసుకున్నదని చెప్పారు. కొంతమంది కుహనా మేధావులు నిరుద్యోగులను రెచ్చగొట్టారని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 చొప్పున అభ్యర్థులను పిలవాలని అడిగితే 1:50కు నోటిఫికేషన్ ఇచ్చారని, గ్రూప్స్‌లో ఒక్క పోస్టు కూడా పెంచలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోస్టులు పెంచాలని అడిగిన నిరుద్యోగులపై లాఠీచార్జీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.