ఎల్లారెడ్డి రూరల్ , డిసెంబర్ 15 : రాష్ట్రంలో రేవంత్ సర్కారు (Revanth Reddy) వచ్చాక అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. అధికారం అండతో కాంగ్రెస్ (Congress) శ్రేణులు దాడులు, హత్యలకు తెగబడుతుండడంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతున్నది. తాజాగా పంచాయతీ ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ నేత.. తమకు వ్యతిరేకంగా పనిచేశారనే అక్కసుతో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబంపై దారుణానికి తెగబడింది. పరామర్శించేందుకు వచ్చిన వారిపైకి సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌ను వేగంగా పోనిచ్చి తొక్కించాడు. వాహనం కింద పడిన మహిళలు హాహాకారాలు చేస్తున్నా కనికరం లేకుండా రెచ్చిపోయాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, టైర్లపై నుంచి వెళ్లడంతో ఇద్దరి చేతులు, వెన్నెముక, పక్కటెముకలు విరిగాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకోగా, కాంగ్రెస్ హత్యారాజకీయాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఖమ్మం జిల్లా న్యూలక్ష్మీపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఓర్వలేక అతడి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడమే గాక ఇద్దరు నేతలపైనా దాడికి తెగబడ్డారు. మంచిర్యాల జిల్లా శెట్పల్లి జీపీ ఎన్నికల్లో కలిసి రావడం లేదనే కక్ష పెంచుకొని బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత కల్లు గీసే కత్తితో దాడి చేశాడు. కాగా, సోమార్పేట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకుల గూండాయిజానికి బెదరవద్దని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. సోమార్పేట సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో కుర్మ పాపయ్య, బీఆర్ఎస్ మద్దతుతో బిట్ల బాలరాజు పోటీ చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో పాపయ్య 49 ఓట్లతో గెలుపొందాడు. అయితే, ఎన్నికల్లో విజయం సాధిస్తే పటేల్ చెరువు మైసమ్మ వద్ద మేకను కోసి దావత్ చేస్తానని పాపయ్య మొక్కుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం వంట సామగ్రి తీసుకెళ్లేందుకు పొలంలో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకురావాల్సిందిగా తన తమ్ముడు చిరంజీవులును ఆయన పురమాయించాడు. చిరంజీవులు ట్రాక్టర్ తీసుకొచ్చే దారిలోనే బాలరాజు ఇల్లు ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన బాలరాజును పరామర్శించేందుకు గ్రామస్తులు సోమవారం ఉదయం బారులు తీరారు. అదే సమయంలో ట్రాక్టర్‌పై వస్తున్న చిరంజీవులు.. జనాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు.
తన అన్నకు వ్యతిరేకంగా పనిచేశారన్న కోపంతో ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ వారిపైకి ఎక్కించాడు. మహిళలు హాహాకారాలు చేస్తున్నా ఆగకుండా వాహనాన్ని రివర్స్ తీసుకెళ్లి మళ్లీ తొక్కించాడు. అక్కడ ఉన్న గంజి భారతి పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్ గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో భారతితో పాటు బండమీది బాలమ్మ, పద్మ సత్యవ్వ, తోట శారద, గంజి ఆద్విక్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓడిన అభ్యర్థి బాలరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అక్కడ ఉన్న వారు వెంటనే స్పందించి నిందితుడికి దేహశుధ్ధి చేసి, పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, క్షతగాత్రులను ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో భారతి వెన్నెముక, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. బాలమ్మ ఎడమచేతి పైనుంచి టైర్ ఎక్కడంతో ఎముకలు నుజ్జునుజ్జయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వీరిని హైదరాబాద్‌కు తరలించారు.

దాడి విషయం తెలుసుకున్న వందలాది మంది గ్రామస్తులు దవాఖానకు చేరుకున్నారు. సర్పంచ్ కుటుంబం అరాచకాన్ని చూసి తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే మదన్మోహన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నేతలు మద్దతుగా వచ్చి బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుర్మ సాయిబాబా, సర్పంచ్ పాపయ్య, నిందితుడు చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పబోగా, పాపయ్య సర్పంచ్ పదవికి రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకం పెరిగి పోయిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మండిపడ్డారు. దాడి విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తితో పాటు తమ అభ్యర్థికి మద్దతు తెలిపిన వారిని చంపేందుకు యత్నించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలిచి 24గంటలు కాకముందే కాంగ్రెస్ అభ్యర్థి అరాచకాలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చడానికి యత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేందర్ డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాడుతానని స్పష్టంచేశారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా, న్యాయం చేస్తామని ఎస్పీ స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామని జాజాల చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళనలు తప్పవని జాజాల హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు ఆండగా ఉండాలని, అవసరమైతే వారిని కలిసేందుకు తాను ఎల్లారెడ్డికి వస్తానని కేటీఆర్ చెప్పారని జాజాల తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్ పరామర్శించనున్నట్టు చెప్పారు.